
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవీ వ్యవహారం హైదరాబాద్లోని ప్రజాభవనక్కు చేరింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో మంత్రి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యి చైర్పర్సన్ పదవి విషయంలో సంప్రదింపులు జరిపారు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి హైదరాబాద్ క్యాంపుకు వెళ్లిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ప్రజాభవన్కు రావాలని జీవన్ రెడ్డిని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించగా.. ఆదివారం సచిన్ సావంత్, లక్ష్మణ్ కుమార్లు ఆయనతో భేటీ అయ్యారు. ఇరు వర్గాల మధ్య రాజీ ఫార్ములాగా ఒకరికి చైర్పర్సన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతి పాదనలు ఉంచినట్టు సమాచారం. జీవన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్పర్సన్ పదవీ ఇవ్వాలని పట్టు బడుతున్నారు. జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర స్థాయికి చేరిన నేపథ్యంలో జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో ఆసక్తిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..