
కేదార్‌నాథ్, 15 ఫిబ్రవరి (హి.స.)శీతాకాలం మంచు కారణంగా ముసివేసిన కేదార్‌నాథ్ ఆలయంపై (Kedarnath Temple) కీలక ప్రకటన వెలువడింది. హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కేదార్‌నాథ్ ధామ్ దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భక్తులకు శుభవార్త అందింది. ఈ ఏడాది కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8:00 గంటలకు తెరవనున్నట్లు శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) అధికారికంగా ప్రకటించింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు ఉఖిమఠ్‌లోని శీతాకాల గద్దీ స్థానమైన ఓంకారేశ్వర ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చర్చించి, గ్రహగతులను లెక్కించి ఈ శుభ ముహూర్తం (Auspicious time) ఖరారు చేశారు.
కేదార్‌నాథ్ ద్వారాల ప్రారంభంతోనే ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) సందడి మొదలుకానుంది. శీతాకాలం దృష్ట్యా గత ఆరు నెలలుగా మూసి ఉన్న ఆలయాన్ని తెరిచేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏప్రిల్ 22న ఉదయం వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ కేదార్‌నాథ్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని అదే సమయంలో గంగోత్రి, యమునోత్రి ధామాల ద్వారాలు కూడా తెరుచుకోనుండటంతో భక్తుల రద్దీ (Crowd of devotees) భారీగా ఉండే అవకాశం ఉంది. యాత్రికుల సౌకర్యార్థం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, రవాణా వసతులపై ప్రభుత్వం త్వరలోనే మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV