
కోల్కత్త, 23 ఫిబ్రవరి (హి.స.)
భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం
చోటుచేసుకుంది. మాజీ కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ స్థాపనలో సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా ఆయన కీలక పాత్ర పోషించారు.
ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన వ్యూహాలు ప్రధాన భూమిక పోషించాయి. అందుకే ఆయనను 'బెంగాల్ రాజకీయ చాణక్యుడు' అని పిలిచేవారు. 2017లో టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఆయన, మళ్లీ 2021లో సొంత గూటికి చేరారు. అయితే, గత కొంతకాలంగా పార్కిన్సన్స్, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బెంగాల్ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు