
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)భక్తుల సౌకర్యార్థం 2026 మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుంది. ఈ టికెట్లకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డిప్‌లో ఎంపికచేస్తారు.
డిప్‌లో ఈ-టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 24 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.మే నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్