
జగిత్యాల, 16 ఫిబ్రవరి (హి.స.)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల
(Jagityal) కాంగ్రెస్లో వర్గపోరు మొదలయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వ్యవహారం కాక రేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రతిపాదనలను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తాజాగా, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును పార్టీ దాదాపు ఖరారు చేసింది. వాణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన అనుచరురాలు కావడంతో జీవన్ రెడ్డి వర్గానికి పెద్ద షాక్గా మారింది. గత కొంతకాలంగా మున్సిపల్ పీఠంపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న జీవన్ రెడ్డికి ఈ పరిణామం మింగుడు పడటం లేదని తెలుస్తోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడంపై పాత కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 40 వార్డుల్లో గెలవాల్సిన చోట 20-22 సీట్లకే పరిమితం కావడానికి అంతర్గత కుట్రలే కారణమని ఇప్పటికే సంజయైపై జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు చైర్పర్సన్ పదవి కూడా ప్రత్యర్థి వర్గానికే దక్కడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ వర్గపోరు పార్టీని బలోపేతం చేస్తుందా లేక పతనానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..