
ప్రతాప్‌గఢ్: 16, ఫిబ్రవరి (హి.స.)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా, అంటు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. సుమారు 1000 కిలోల బరువున్న హై మాస్ట్ లైటింగ్ స్తంభం ఒకటి కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ దుర్ఘటనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంప్ వద్ద కార్మికులు హై మాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది.
ఎస్‌పీ నేత లాల్ బహదూర్ యాదవ్ (47) తన కారులో నగరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటు నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషాద వార్త తెలియగానే పార్టీ శ్రేణులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ