
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్ ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ప్రత్యూష మరుసటి రోజు మరణించగా.. సిద్ధార్థ రెడ్డి చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక ఆత్మహత్యకు ప్రేరేపించడమా అనే దానిపై వివాదం చెలరేగింది. ఇది హత్యే అని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు తర్వాత సిద్ధార్థ రెడ్డిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో 2004లో సిద్ధార్థ రెడ్డికి సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
2011లో హైకోర్టు.. ఈ శిక్షను రెండేళ్లకు తగ్గించి, రూ.50,000 జరిమానా విధించింది. ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరూ 2012లో సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి, అతడికి శిక్ష పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2025 నవంబర్‌లో వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు శిక్షను సమర్థించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ