
న్యూఢిల్లీ, 17 ఫిబ్రవరి (హి.స.)
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
తగిన ఇండియా AL ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ తొలిరోజున భారీగా సందర్శకులు తరలిరావడం, వారందరికీ సౌకర్యాలు కల్పించకపోవడంతో సమ్మిట్ రసాభాసగా మారింది. దీంతో ఏకంగా కేంద్రమంత్రి క్షమాపణలు కోరాల్సి వచ్చిందంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ డే మంగళవారం జరిగిన సెషన్స్ అన్ని సజావుగా జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
సమస్య ఎక్కడ తలెత్తిందంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద AL ఈవెంట్లలో ఒకటిగా ప్రకటించిన ఈ సదస్సుకు సోమవారం అంచనాలకు మించిన సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 80,000 మందికిపైగా ఒకేసారి రావడంతో ఎంట్రీ గేట్ల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. భద్రతా తనిఖీలకు ఎక్కువ సమయం తీసుకోవడంతో చాలామంది అసహనం వ్యక్తం చేసారు. 35,000 మంది వరకు మాత్రమే ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అంతకు రెట్టింపు మంది రావడంతో నిర్వహకులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు రావడం, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవెంట్ కు హాజరవడంతో అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల సాధారణ సందర్శకులను కొద్దిసేపు లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా బయట ఎండలోనే గంటల తరబడి వేచి చూసారు.
పేరు గొప్ప.. సౌకర్యాలు శూన్యం
అంతేకాదు వై-ఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ లోపాలు, UPI పేమెంట్స్ సరిగా పనిచేయకపోవడం, ఎగ్జిబిటర్లకు ఆహారం, తాగునీరు అందుబాటులో లేకపోవడం, కొందరి గాడ్జెట్లు, వస్తువులు పోయాయని ఫిర్యాదులు రావడం, ల్యాప్టాప్లు, లోపలికి బ్యాగ్లను అనుమతించకపోవడం, సెషన్లలో సీటింగ్ సమస్యలు వంటి అంశాలు తీవ్ర అసౌకర్యానికి, విమర్శలకు దారితీశాయని బీబీసీ, రాయిటర్స్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేసాయి.
కేంద్రమంత్రి క్షమాపణలు
ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రెండో రోజు జరిగిన మీడియా సమావేశంలో క్షమాపణలు తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మేము క్షమాపణలు కోరుతున్నామని పేర్కొన్నారు. వార్ రూమ్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సమ్మిట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రెండో రోజు 70,000 మందికి పైగా సందర్శకులు పాల్గొనగా.. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని వివరించారు. మొత్తంగా ఈ సదస్సులో 500కి పైగా సెషన్లు, 500కి పైగా స్టార్టప్లు, గ్లోబల్ లీడర్లు పాల్గొంటున్నారు. 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు, సావరిన్ AI మోడల్స్, అదనంగా 20,000 GPUS ఆర్డర్లు, హెల్త్కేర్, వ్యవసాయ రంగాల్లో ఉచిత AI పరిష్కారాలు వంటి అంశాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే మొదటి రోజు లాజిస్టిక్స్ సమస్యలు కొంత ప్రతికూల అభిప్రాయం కలిగించడంతో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..