
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)
మున్సిపల్ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. మూడు వారాల నుంచి జరుగుతున్న ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ అత్యధిక చైర్మన్, మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లతో మొత్తం 92 స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 11 మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. హంగ్, స్పష్టమైన మోజార్టీ లేని మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే మున్సిపల్కార్యాలయాలకు పార్టీ కేడర్ లు చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇరువర్గాలను బుజ్జగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాంగ్రెస్ ఆధిపత్యం
మరోవైపు జనగామ, చౌటుప్పల్తో పాటు స్పష్టమైన మెజార్టీ రాని దగ్గర అన్ని చోట్లా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాంతో అక్కడ ఎన్నికలను నేటికి వాయిదా వేశారు. ఇక ఎన్నికలు సజావుగా సాగడంతో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్న దగ్గర పార్టీ కేడర్, నాయకులు ర్యాలీలు తీస్తూ సంబురాలు చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ కరీంనగర్ మినహా మిగిలిన కార్పొరేషన్లు అన్నింటినీ కైవసం చేసుకుంది. నిజామాబాద్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మేయర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ (ఎంఐఎం) పార్టీలు దక్కించుకున్నాయి. కొత్తగూడెంలో సీపీఐతో పొత్తు పెట్టుకొని మేయర్(సీపీఐ), డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) పార్టీలు పాగా వేశాయి. మిగిలిన రామగుండం, మంచిర్యాల, మహబూబ్నగర్, నల్గొండ కార్పొరేషన్లలో భారీ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..