ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
High court


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదాకు కారణంగా తెలుస్తోంది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని ఎల్లుండి తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కౌన్సిల్ హాల్లో అనూహ్య పరిణామాలు

ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే, ఇబ్రహీంపట్నం కౌన్సిల్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్‌కి చెందిన టేకుల సుదర్శన్ రెడ్డిని 15 మంది కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో కిడ్నాప్ అయ్యారని భావించిన కౌన్సిలర్ యాదగిరి.. ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే అనూహ్యంగా కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో హైకోర్టు స్టే ఉత్తర్వులు అందడంతో అధికారులు ఇబ్రహీంపట్నం ఎన్నికను నిలిపివేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande