మున్సి'పోల్స్'తో అధికార పార్టీలో జోష్.. మరో 'స్థానిక' యుద్ధానికి సై..!
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారీ విజయం సాధించి మంచి ఊపులో కనిపిస్తున్న అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా కోర్ అర్బన్ ఏరియాలోని 3 కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సీఎంసీ
స్పెషల్ న్యూస్


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారీ విజయం సాధించి మంచి ఊపులో కనిపిస్తున్న అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా కోర్ అర్బన్ ఏరియాలోని 3 కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)కు ఎన్నికలు నిర్వహించడమా? లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడమా? అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏ ఎన్నికను ముందు నిర్వహిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది? అని పలు కోణాల్లోనూ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులోపు క్లారిటీ వస్తుందని మంత్రులు అంచనా వేస్తున్నారు.

పది పరీక్షలు ముగియగానే..

మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరివరకు జరుగనున్నాయి. అదే సమయంలో అధికారులు, మంత్రులు బడ్జెట్ సెషన్స్లో బిజీలో ఉండనున్నారు. కావున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే, టెన్త్ ఎగ్జామ్స్ కూడా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనుండగా ఎలక్షన్స్ నిర్వహించడం కష్టం. దీంతో ఏప్రిల్ 10 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ చివరివరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తిచేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్లు సమాచారం. మే నెలలో విపరీతమైన ఎండల కారణంగా పోలింగ్ నిర్వహణ కష్టంగా మారనుంది. దీనికి తోడు వేసవిలో సహజంగా తలెత్తే తాగు నీరు, కరెంట్ కోతల సమస్యలు రూలింగ్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

కోర్ అర్బన్లో పట్టు కోసం ప్లాన్..

మున్సిపల్ ఎన్నికలతో పాటు రెండు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్థానాలను సొంతం చేసుకున్నది. మొదటి నుంచి కోర్ అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్కు పట్టులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోలేదు. దీంతో ముందుగా అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నది. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు మంచి జోష్లో ఉండగా.. ఈ సమయంలోనే కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తిరుగులేకుండా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా ఇటీవల 3 కార్పొరేషన్లు( గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) ఏర్పాటు చేయగా.. ఈ మూడు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి, తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది.

90 శాతం MPTC, ZPTCలు టార్గెట్

సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకున్నది. దీంతో వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయని అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే 10 శాతం నిధులు నిలిచిపోవడం తప్పా ఇతర సమస్యలు లేవంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల తరువాత యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించగా త్వరలో ఆ నిధులను రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే 90 శాతం పైగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలిచి, మెజార్టీ మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను సొంతం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాగా, కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించవొచ్చని మరికొందరు వాదిస్తున్నారు.ముందు ఏ ఎన్నికలకు వెళ్లాలనే అంశంపై ఈ నెలాఖరుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు కేబినెట్ సమావేశం జరుగనుండగా.. కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ ఎన్నికలకు ముందువెళ్లడమా? ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు వెళ్లడమా? అనేది క్లారిటీ వస్తుందని అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande