పల్లెల ప్రగతికి మహిళా నాయకత్వం కీలకం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్ధ్యాలను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన
Collector


నిజామాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్ధ్యాలను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ఐదు రోజుల పాటు కొనసాగే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్దేశ్యంతో స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సర్పంచులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, గ్రామాల్లో సమర్ధవంతమైన పాలనను అందిస్తూ రిజర్వేషన్లకు సార్ధకత చేకూర్చాలని హితవు పలికారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, గ్రామ ప్రథమ పౌరులుగా గౌరవాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందని అన్నారు.

నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచుల పై ఉందని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కస్తుర్బా గాంధి విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, అంగన్వాడి కేంద్రాలు వంటి వాటిని సందర్శిస్తూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని సవరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల ప్రగతి కోసం సర్పంచులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాల్య వివాహాలు వంటి దురాచారాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు.

ప్రజలతో మమేకమై పారదర్శకంగా పాలన సాగించాలని, గ్రామంలో నెలకొని ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకుంటే సమస్యలను పరిష్కరించేందుకు వీలుంటుందని సూచించారు. పన్నులు, ఇతర స్థానిక వనరుల ద్వారా సమకూరే ఆదాయ వనరులపై దృష్టిని కేంద్రీకరించాలని, ఆదాయం సమకూరితే ప్రజోపయోగ పనులను చేపట్టి మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, వినూత్న ఆలోచనలతో పల్లెల ప్రగతికి పాటుపడుతూ మంచి గుర్తింపు పొందాలని సూచించారు. సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన 10 మంది సర్పంచులను ఉత్తమ సర్పంచులుగా ఎంపిక చేసి సన్మానిస్తామని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande