
వేములవాడ, 17 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల అత్యంత వైభవంగా నిర్వహించిన మహా శివరాత్రి జాతర వేడుకలు సోమవారం రాత్రితో ముగిశాయి. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు పయనమయ్యారు. జాతరలో భాగంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం రాత్రి 7 గంటల వరకు సుమారు 2.5లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
జాతర నేపథ్యంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గీతేల ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, దేవాలయం అధికారులు, సిబ్బంది సహకారంతో జాతరకు వచ్చిన భక్తులకు సకల సదుపాయాలు కల్పించడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారూ. మరోవైపు జాతర ముగిసిన నేపథ్యంలో ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఎక్కడ చెత్త నిల్వలు ఉండకుండా సంబంధిత శాఖల అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు