
విజయవాడ, 17 ఫిబ్రవరి (హి.స.) రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతి అంశాలపై రైల్వే డీఆర్ఎంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వివిధ రైల్వే ప్రాజెక్టుల పనితీరు, కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వంటి అనేక అంశాలను ఎంపీకి డీఆర్ఎం వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా కృషి చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఏపీకి రైల్వేలు, అమరావతి రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్లు ఈ బడ్జెట్‌లో ఉండేలా కృషి చేశారని తెలిపారు.
విజయవాడ నగరంలోని పలు సమస్యలపై డీఆర్ఎంతో సుదీర్ఘంగా చర్చించినట్లు ఎంపీ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు సంబంధించి పార్లమెంట్‌లో తాము ప్రస్తావించగానే రైల్వే మంత్రి వెంటనే ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. నీతి ఆయోగ్ నుంచి అనుమతి వచ్చిందని, ప్రీ-బిడ్ మీటింగ్‌లు కూడా జరిగాయని ఎంపీ వెల్లడించారు. భారతదేశంలోనే అత్యంత రద్దీగా, అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ మోడ్రనైజేషన్ పూర్తి అయితే.. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను మించి ఆధునిక రూపం సంతరించుకుంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారని తెలిపారు.
అతి త్వరలోనే రాయనపాడు రైల్వే స్టేషన్.. అమృత్ భారత్ స్టేషన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోందని వెల్లడించారు. గుణదల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్టేషన్ కింద ప్రారంభం అవుతుందని ఎంపీ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిన ఏకైక స్టేషన్ కొండపల్లి అని.. దీనికి కూడా అమృత్ భారత్ కింద అప్లై చేసి, అమృత్ భారత్ 2.0 సెకండ్ ఫేజ్ కింద తీసుకురాబోతున్నామని చెప్పారు. కొండపల్లి రైల్వే స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్