
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) : రొయ్యల చెరువు వద్ద తిరుగుతున్న ఫ్యాన్ సెట్‌లో ఇరుక్కుని తల్లీకూతుళ్లు దుర్మరణం పాలైన విషాద ఘటన ఇది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాసరావుకు కలిదిండిలోని వీర నాగ జ్యోతితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 14న వీర నాగజ్యోతి ఇద్దరు పిల్లలతో కలిసి కలిదిండిలోని పుట్టింటికి వచ్చారు. ఆదివారం పెద్ద కుమార్తె భోగేశ్వరం తీర్థానికి వెళ్లింది. చిన్న కుమార్తె హేమ(6)తో కలిసి వీర నాగ జ్యోతి (32) తండ్రి సాగు చేసుకుంటున్న రొయ్యల చెరువులో మేత వేయడానికి వెళ్లారు.
ఆ సమయంలో గట్టుపై ఇంజిన్‌కు బిగించి ఉన్న ఫ్యాన్‌సెట్ రాడ్డును దాటుతుండగా.. ప్రమాదవశాత్తూ వీర నాగ జ్యోతి వస్త్రాలు ఆ రాడ్డుకు తాకడంతో ఆమెతో పాటు హేమ కూడా ఆ ఫ్యాన్ సెట్ రాడ్డులో ఇరుక్కుపోయింది. క్షణాల్లో ఇద్దరూ నుజ్జునుజ్జు అయిపోయి శరీరాలు చాపలా చుట్టుకుపోయాయి. ఆ ఒత్తిడికి ఫ్యాన్ సెట్ల బెల్ట్ తెగిపోయింది. ఇది చూసి పక్క చెరువులో రైతులు పరుగున వచ్చారు. అప్పటికే తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. రైతులు ఈ విషయాన్ని వీర నాగ జ్యోతి భర్త శ్రీనివాసరావుకు తెలిపారు. ఆ దృశ్యాలు కుటుంబ సభ్యులతో పాటు చూపరులనూ తీవ్ర ఉద్వేగానికి గురి చేశాయి. ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ