
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) :ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఆ లక్ష్యంతోనే అడుగులు వేస్తామని పేర్కొన్నారు. పాలన ప్రక్రియలు, నిబంధనలు మరింత సరళం చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలనూ సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గమర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలని, ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకూడదన్నారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు విధులను సమర్థంగా నిర్వహించేలా సామర్థ్యాలను పెంచుకునే శిక్షణ పొందాలన్నారు. పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలను అన్ని పథకాలు, కార్యక్రమాల్లో అనుసరించాలని అధికారులకు సీఎం సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ