
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.)దేశ రాజధానిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై లోక్‌సభ సచివాలయం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన వివాదాస్పద వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు గాను తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు సభాహక్కుల ఉల్లంఘన (Breach of Privilege) నోటీసులు జారీ అయ్యాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. సదరు వీడియోలు గౌరవప్రదమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సభను ధిక్కరించినట్లవుతుందని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన కీలక నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా , సుప్రియా శ్రీనేత్ వంటి వారితో పాటు మరో ఆరుగురు సభ్యులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ సచివాలయం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు మూడు రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలని గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం రాకపోతే, సభాహక్కుల కమిటీ దీనిపై లోతైన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ