
అనంతపురం, 17 ఫిబ్రవరి (హి.స.)
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం..
ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఇదివరకే తెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసందే. కానీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. సీబీఐ (CBI) సమర్పించిన ఆధారాలు ప్రాథమికంగా బలమైనవిగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి మైనింగ్ లీజులు కట్టబెట్టే క్రమంలో శ్రీలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తన ఛార్జ్‌షిట్‌లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనులను సొంత పరిశ్రమ అవసరాలకు (Captive) మాత్రమే కేటాయించాలని.. కానీ, శ్రీలక్ష్మి తన అధికార పరిధిని మించి ప్రభుత్వ ఉత్తర్వుల నుండి ‘క్యాప్టివ్’ అనే పదాన్ని తొలగించారని ఆరోపించారు. దీంతో నిందితులు ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని భారీగా లాభపడటానికి దారులు తీశారని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మి పదవిలో ఉన్న కాలంలోనే ఆమె మరిది పేరుతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, ఇవన్నీ మైనింగ్ కేటాయింపులకు ప్రతిఫలంగా వచ్చినవేనని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టులో విచారణ ముమ్మరం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురికి జైలు శిక్షలు ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా ఉచ్చు బిగుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV