
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలో విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం విధి అని గుర్తుచేశారు. కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని, ఇలా చేయడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. ఉద్యోగులు ఉన్న సెలవులకంటే ఎక్కువ తీసుకుంటే జీతాలు కట్ చేసినట్లే.. ఎమ్మెల్యేలకు కూడా ఆ నిబంధనను ఎందుకు వర్తింపచేయకూడదన్నారు. ఈ అంశాలపై జాతీయస్థాయిలో చర్చించాలని, ప్రస్తుతం 8 దేశాల్లో ఈ నిబంధన ఉందని తెలిపారు. రీసెంట్ గా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తోందని అయ్యన్న తెలిపారు. సభలో ఎవరు ఎంతసేపు ఉన్నారన్నది కూడా అందులో రికార్డు అవుతోందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 11న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు సభకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి హాజరయ్యారు. సరిగ్గా 11 నిమిషాలే ఉండి వెళ్లిపోవడంతో.. ఆ రోజు కూడా అయ్యన్న వారిపై అసెంబ్లీ లాబీలో సెటైర్లు వేశారు. తాజాగా ఎమ్మెల్యేల అటెండెన్స్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించినవేనని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV