
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.) :రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ 5స్టార్ రేటింగ్‌లోకి తెస్తామని, రూ.వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ‘నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆధునీకరణలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఆ పనులకు సకాలంలో బిల్లులు చెల్లించిన విషయం వాస్తవమేనా?’ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. గత ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలల్ని మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 వల్ల పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవో రద్దు చేశామని తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్‌ఎంసీ అకౌంట్‌లో రూ.200 కోట్లు ఉన్నాయని, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.800 కోట్లు అదనంగా కేటాయించామన్నారు. ఈ రెండూ కలిపి వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1000 కోట్లు ఖర్చు చేసే అవకాశం వచ్చిందన్నారు. మరోవైపు పాఠశాలల విద్యాభివృద్ధిలో ‘వన్ క్లాస్- వన్ టీచర్’ విధానం చాలా కీలకమైందన్నారు. గతంలో 3 శాతం పాఠశాలల్లోనే ఈ విధానం ఉంటే.. ఇప్పుడు 33 శాతానికి పెంచామన్నారు. దీనిద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, పెయింట్స్, బెంచీలు, టాయ్‌లెట్స్, తాగునీరు అందించాలని నిర్ణయించామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ