
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, జిల్లాలో శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాహన షోరూంల్లోనే నిర్వహిస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటే శాశ్వత రిజిస్ట్రేషన్‌నూ పూర్తిచేయించే బాధ్యతను రాష్ట్ర రవాణా శాఖ షోరూంల నిర్వాహకులకు అప్పగించింది.
ఈ విధానం జిల్లాలో ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కానీ, సాఫ్ట్‌వేర్‌పై షోరూంలలోని సిబ్బందికి అవగాహన సరిగా లేకపోవడంతో మొన్నటిదాకా సేవల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. కొన్ని అంశాల్లో రవాణా శాఖ అధికారులకూ స్పష్టత కొరవడింది. ప్రస్తుతం సందేహాలన్నీ నివృత్తి కాగా, వ్యక్తిగత ద్విచక్రవాహనాలు, కార్లకు షోరూంల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏజెంట్ల బెడద లేకుండా, వాహనం కొన్నచోటే సేవలందిస్తుండటంతో వాహనదారులకు సైతం అదనపు భారం తప్పుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ