
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.): గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్‌లో ఏఐ ప్రభావంపై మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్‌సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.
7
బంగ్లా’కు సహకరిస్తాం.. భారత్‌కు రండి’
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.): బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆయనను భారత్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యయుతంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఓం బిర్లా నూతన ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయనకు స్వయంగా అందజేశారు.
పొరుగు దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన లేఖ ద్వారా తారిఖ్ రెహ్మాన్ భారతదేశ పర్యటనకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఓం బిర్లా తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంటూ ‘ప్రధాని మోదీ పంపిన లేఖను రెహ్మాన్‌కు అందజేశాను. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని పునరుద్ఘాటించాను’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ