తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి.
Bomb threat


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు ఇవాళ (బుధవారం) బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోర్టుకు ఈరోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో కోర్టు సిబ్బంది త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో కోర్టు ప్రాంగణంలో బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ బాంబు కాల్ రావడంతో.. న్యాయవాదులు, కక్షిదారులను కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బయటకు పంపేశారు. అలాగే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కోర్టులో ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఈ ఫోన్ కాల్ ఆకతాయి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అనంతపురం కోర్టుకూ ఇదే తరహ ఫోన్ కాల్ వచ్చింది.

ఇక తెలంగాణలో పలు కోర్టులకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు అందాయి. ఆ జాబితాలో నాంపల్లి కోర్టు సైతం ఉంది. మధ్యాహ్నం 12.05 గంటలకు కోర్టుల్లో బాంబు పేలుతుందంటూ ఈ మెయిల్‌లో అగంతకులు పేర్కొన్నారు. దాంతో కోర్టులోని సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అలాగే కరీంనగర్ కోర్టులో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో సైతం ఇదే తరహాలో కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే మళ్లీ అలాగే బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దాంతో కోర్టుల్లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande