
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)
ఢిల్లీ మీటింగ్... ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్లో హాట్ టాపిక్గా మారింది. ఈనెల 19న ఏఐసీసీ నేతలు.. సీఎం, పీసీసీ చీఫ్ పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు. వారి వద్ద ఉన్న ప్రొగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా.. ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడనున్నారు. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్లో ఏం జరగనున్నది? అధిష్టానం ఎవరికి క్లాస్ తీసుకుంటుంది? ఎవరిని మెచ్చుకుంటుంది? అసలు తమ ప్రొగ్రెస్ రిపోర్ట్లో ఏముంది? అనే టెన్షన్ మంత్రుల్లో నెలకొన్నది. తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని మెజార్టీ మంత్రుల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరుపైనా సమీక్ష ఉంటుందని సమాచారం.
చిట్టా విప్పనున్న హైకమాండ్..
మంత్రుల పెర్ఫార్మెన్స్పై అధిష్టానం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్లు తెలిసింది. మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం మినిస్టర్ల పెర్ఫార్మెన్స్పై హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అధిష్టానం సైతం ఆ రెండు నివేదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక దూతల ద్వారా మరో నివేదిక తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వాటన్నింటినీ స్టడీ చేసిన ఏఐసీసీ నేతలు.. మంత్రుల పనితీరుపై ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికల్లోని నెగెటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం అందినట్లు తెలిసింది. అందులో సహచర మంత్రుల కంప్లయింట్స్ సైతం ఉన్నట్టు సమాచారం. వీటన్నింటిపై అధిష్టానం వివరణ తీసుకునే చాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
అవినీతి ఆరోపణలపై ఆరా..
మెజార్టీ మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే తమ శాఖల్లోని అవినీతికి తోడు తమ జిల్లాల్లో భూ వివాదాలు, రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ వ్యాపారులతో వాటాలు, ఇసుక మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు మంత్రులు అధికారులతో గొడవ పడటం, వారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నట్లు కంప్లయింట్స్ ఉన్నాయి. ఈ మధ్య తలెత్తిన కొన్ని వివాదాలు అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. వీటన్నింటిపై అధిష్టానం మంత్రుల నుంచి వివరణ తీసుకుంటుందని ప్రచారం జరుగుతున్నది.
శాఖల్లో ఫ్యామిలీల జోక్యంపై సీరియస్
కొన్ని శాఖల్లో మంత్రుల కంటే వారి కుటుంబసభ్యుల జోక్యమే ఎక్కువగా ఉన్నదనే ఫిర్యాదులు అధిష్టానానికి చేరినట్లు తెలిసింది. సంబంధిత శాఖలో ఏ చిన్న పని కావాలన్నా.. ఫ్యామిలీ మెంబర్స్ అనుమతి అవసరం అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రతి ఫైల్ను సన్నిహితులు మానిటరింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు చాలా కాలంగా ఉన్నాయి. వీటన్నింటిపై అధిష్టానం కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.
మంత్రులపై చర్యలు ఉంటాయా?
ఢిల్లీ మీటింగ్ తర్వాత పనితీరు సరిగా లేని మంత్రులపై ఏం యాక్షన్ తీసుకుంటారు? కేబినెట్ నుంచి తప్పిస్తారా? కేవలం శాఖల మార్పు వరకే పరిమితం అవుతారా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల తంతు పూర్తయిన తర్వాతే మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ లేదా శాఖల మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది.
పీసీసీ చీఫ్ పనితీరుపై నివేదిక
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మహేశ్ కుమార్ గౌడ్ వ్యవహరించిన తీరు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడిందోననే అంశంపై కూడా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నిర్వహించిన కార్యక్రమాలపై ఆరాతీయనున్నారు. అలాగే, ఏఐసీసీ పిలుపు ఇచ్చిన ప్రొగ్రామ్స్ ను ఏ మేరకు సక్సెస్ చేశారోననే అంశంపై కూడా హైకమాండ్ వద్ద నివేదిక ఉన్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..