హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి.
ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేస్తోంది.
High court


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)ఇబ్రహీంపట్నం పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబసభ్యులు.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని హైకోర్టు ముందు హాజరుపరచాలని రెండు రోజులు క్రితం న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు (బుధవారం) కౌన్సిలర్ యాదగిరిని కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. దీంతో హైకోర్టు ముందు యాదగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఫలితాలు వెల్లడైన తర్వాత 12 గంటలపాటు హైదరాబాద్‌లో తిప్పారని.. బలవంతంగా తనను చీరాల తీసుకెళ్లారని చెప్పారు యాదగిరి. రెండు రోజులపాటు చీరాలలోని రిసార్ట్‌లో ఉంచారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటిం‌గ్‌కు హాజరైనట్లు ఆకుల యాదగిరి.. కోర్టుకు తెలియజేశారు. అతని స్టేట్‌మెంట్ పూర్తి అయిన తర్వాత హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు క్యాంపు పేరుతో తన భర్తను కిడ్నాప్ చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. దీంతో యాదగిరి మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఆకుల యాదగిరి భార్య అనుమానాలు వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande