
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.): రష్యా నుంచి మన దేశానికి దిగుమతయ్యే వస్తువులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో 40 శాతానికి పడిపోయాయి. ఇందులో రష్యా ముడి చమురుకు (Russian oil Imports) భారీ కోత పడింది. భారత్‌లోని శుద్ధి కర్మాగారాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గించడంతో ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది.
గతేడాది జనవరిలో 4.81 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ (India) రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది అది 2.86 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. 2022 నుంచి భారీ తగ్గింపు ధరతో ముడిచమురు దిగుమతులను రష్యా ఆఫర్ చేసింది. అప్పటి నుంచి భారత్‌లో ఈ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. అయితే, రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షల ఒత్తిడి పెరగడం, యూఎస్‌తో వాణిజ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఇటీవలి కాలంలో ఈ కొనుగోళ్లు మందగించినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఇటీవల భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (India-USA Trade) కుదిరిన సంగతి తెలిసిందే. ఇందులో రష్యా ముడి చమురు కొనుగోలుపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మాస్కో చమురు దిగుమతి చేసుకోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అగ్రరాజ్యం ప్రకటించింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ