
ఢిల్లీ, 18 ఫిబ్రవరి (హి.స.)భారతదేశంలో అత్యంత సుందరికరమైన ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయి. అటువంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలోని అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ఆ మంటలను ఆర్పేందుకు భారత వైమానిక దళ హెలికాప్టర్లు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని వాలాంగ్ (Walong) ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్లు సుమారు 1,39,800 లీటర్ల నీటిని ఆకాశం నుండి కురిపించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అక్కడ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
మరోవైపు, నాగాలాండ్‌లోని జుకో వ్యాలీ (Dzukou Valley) లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ జప్ఫు శిఖరం (Japfu Peak) సమీపంలోని ఏటవాలు కొండలు, తక్కువ దృశ్యమానత (Poor Visibility), గాలిలో తక్కువ ఆక్సిజన్ వంటి క్లిష్ట పరిస్థితుల మధ్య Mi-17 V5 హెలికాప్టర్లు పోరాడుతున్నాయి. దిమాపూర్‌లోని పదుంపోఖిరి సరస్సు నుండి నీటిని సేకరించి మంటలపై కురిపిస్తూ, కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా వైమానిక దళం శ్రమిస్తోంది. గత 10 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుండగా.. భారత వైమానిక దళ హెలికాఫ్టర్లు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV