పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు Assembly ఆమోదం
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.) ఏపీ శాసనసభలో ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026'' కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు కొణిదల పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మం
శాసనసభ


అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)

ఏపీ శాసనసభలో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026' కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామాత్యులు కొణిదల పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు.

బిల్లులోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...‘గతంలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఓటు హక్కు పొందడానికి కేవలం జనవరి 1ని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన యువత మరో ఏడాది వేచి చూడాల్సి వచ్చేది. తాజా సవరణ ప్రకారం ఏడాదికి నాలుగు సార్లు (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, మరియు అక్టోబర్ 1) ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర చట్టం ఇప్పటికే ఈ నాలుగు తేదీల విధానాన్ని అమలు చేస్తోంది. మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధానం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలను కూడా వీటికి అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 23, 2025న ఈ అంశంపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి శాసనసభ చట్టబద్ధత కల్పించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి (నెల్లిమర్ల), ఎన్. ఈశ్వరరావు (ఎచ్చెర్ల), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్) పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించాలని వారు సూచించారు. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

సభ్యులందరి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026 ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande