
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.)
, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్ విధానాన్ని తీసుకొస్తోంది. ఐఐటీ మద్రాస్ రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు.
దీనికి సంబంధించి దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో 20న (శుక్రవారం) ఐఐటీ మద్రాస్‌తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఐఐటీ మద్రాస్ ఈ సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందించనుంది. పాఠశాల విద్యాశాఖ వద్ద ఉన్న కంటెంట్‌ను ఐఐటీ మద్రాస్‌కు అందిస్తుంది. దీన్ని విద్యార్థుల డివైజెస్‌కు అక్కడి నుంచి పంపిస్తారు. తెలుగు, ఆంగ్లం హిందీ భాషల్లో కంటెంట్ ఉంటుంది. మొబైల్ యాప్, వెబ్, వాట్సప్ ఇంటర్‌ఫేస్‌లలో పని చేస్తుంది. విద్యార్థులు నచ్చిన పాఠాన్ని నేర్చుకోవచ్చు. విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నారనేదాన్ని అక్కడే ప్రశ్నలు ఇస్తారు. వాటికి రాసిన సమాధానాల ఆధారంగా విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ