
భూపాలపల్లి, 19 ఫిబ్రవరి (హి.స.)
రెండు రోజులుగా భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు భూపాలపల్లి జిల్లా అడవి ప్రాంతంలో పోలీస్ బలగాలు భారీగా మొహరించడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మావోయిస్టు నేతలు లొంగి పోయారా లేక ఈ ప్రాంతంలోకి ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు దళాలు చేరుకున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టులు కోలుకోని విధంగా దెబ్బ తలగడంతో ఉన్న కొద్దిమంది సేఫ్టీ కోసం ఈ ప్రాంతానికి వచ్చినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం నుంచి ఈ ప్రాంతంలోకి భారీగా బలగాలను దించారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ మండలంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మహా ముత్తారం మండలంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీ బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపులు చేస్తున్నారు. మావోయిస్టులకు అవసరమైన వస్తువులు చేరవేస్తున్నారని సమాచారం కొంతమేరకు తనిఖీలు చేపడుతున్నారు. గత ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి లేదు. ఈ ధీమాతోనే మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి చొరబడినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లో గాలింపులు చేపట్టి సరిహద్దు గ్రామాల్లో నిఘాను పెంచారు. కొన్నేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం రెండు రోజులుగా పోలీసుల మొహరింపుతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామంలోనైనా మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటే ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం నుంచి పోలీసు శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు