ప్రపంచదృష్టిని ఆకర్షించిన హైదరాబాద్..'బయోఏషియా'లో స్టార్టప్ల హవా
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.) హైదరాబాద్ నగరం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక బయోఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచింది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల నుంచి వచ్చిన స్టార్టప్ సంస్థలు తమ అత్
బయో ఏషియా


హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)

హైదరాబాద్ నగరం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక బయోఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచింది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల నుంచి వచ్చిన స్టార్టప్ సంస్థలు తమ అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తూ ఆరోగ్య రంగానికి కొత్తదారులు చూపాయి. కృత్రిమమేధ(ఏఐ), జీనోమ్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్, వ్యాక్సిన్ భద్రత, హెర్బల్ ఔషధాలు, బయోమార్కర్ పరిశోధనలు వంటి విభిన్న రంగాల్లో వినూత్న పరిష్కారాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఆరోగ్యసేవల్లో డాక్యుమెంటేషన్ పెద్ద సవాల్గా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా అచల హెల్త్ సర్వీసెస్ సంస్థ దేశంలోనే తొలి హెల్త్కేర్ స్పెషలైజ్డ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ను అభివృద్ధి చేసింది. తద్వారా ఆస్పత్రుల్లో డిశ్చార్జ్ సమ్మరీ, క్లినికల్ నోట్స్, ల్యాబ్ రిపోర్ట్ సారాంశాలు, మెడికల్ కోడింగ్ వంటి ప్రక్రియలను ఆటోమేటిక్గా రూపొందించవచ్చు. దీనివల్ల డాక్టర్లపై భారం తగ్గి, వారు రోగులపై మరింత సమయం కేటాయించగలుగుతారు. ఆస్పత్రుల నిర్వహణలో ఖర్చులు తగ్గడంతో పాటు సేవల వేగం పెరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వ్యాక్సిన్ భద్రత మానిటరింగ్..

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ నిల్వ, రవాణాలో ఉష్ణోగ్రత నియంత్రణ కీలక అంశం. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎక్సిన్జ్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఏఐ ఆధారిత డిజిటల్ వ్యాక్సిన్ మానిటర్ను రూపొందించింది. ప్రతి వ్యాక్సిన్ సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, ఆ సీసా ఉష్ణోగ్రత చరిత్ర, నిల్వ కాలం, నాణ్యత ధృవీకరణ వంటి వివరాలు మొబైల్ యాప్లో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీ వ్యాధులకు జీన్ ఎడిటింగ్ ఆశ..

జన్యు సంబంధిత కిడ్నీ వ్యాధులు ఇప్పటివరకు డయాలిసిస్ లేదా ట్రాన్స్ ప్లాంట్ వంటి ఖరీదైన చికిత్సలపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెలెక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆశాజనకంగా కనిపిస్తున్నది. ఒకే డోసుతో జన్యులోపాలను సరిచేసే విధానంపై సంస్థ పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక చికిత్స అవసరం లేకుండానే రోగులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య ఖర్చులు తగ్గడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడుతున్నారు. నిపుణులు

హెర్బల్ మెడిసిన్ పరిశోధనలు..

నేచురల్ సొల్యూషన్స్ అండ్ న్యూట్రాస్యూటికల్స్ సంస్థ విరులినా అనే హెర్బల్ ఔషధాన్ని ప్రదర్శించింది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను లక్ష్యంగా చేసుకుని సంప్రదాయ ఔషధ గుణాలను ఆధునిక పరిశోధనలతో మేళవించి రూపొందించారు. క్లినికల్ పరీక్షల అనంతరం మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నది. మరోవైపు.. శ్రీ గురవే లైఫ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన బయోమార్కర్ టెక్నాలజీ బయాప్సీ కచ్చితత్వాన్ని పెంచడంలో సహాయపడుతున్నది. తద్వారా క్యాన్సర్ వంటి తీవ్ర తరమైన వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయి. పరీక్షల్లో భవిష్యత్ భాగస్వామ్యాలకు వేదిక. ఈ సదస్సు ద్వారా హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ మ్యాప్పై మరింత బలంగా నిలిచింది. ఈ తరహా సదస్సులు కేవలం ఆవిష్కరణల ప్రదర్శనకే పరిమితం కాకుండా, భవిష్యత్ భాగస్వామ్యాలకు వేదికగా మారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. యువతకు పరిశోధన, డేటా సైన్స్, బయోటెక్ తయారీ, క్లినికల్ ట్రయల్స్ వంటి రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande