
నాగర్ కర్నూల్, 19 ఫిబ్రవరి (హి.స.)
నాగర్కర్నూలు జిల్లా నల్లమల
అడవుల పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కార్చిచ్చు కొనసాగింది. అమ్రాబాద్ డివిజన్లోని మన్ననూర్ దోమలపెంట (బ్రహ్మగిరి) రేంజ్ పరిధిలో దాదాపు 60 హెక్టార్లలో అడవి దగ్ధమైనట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అటవీ క్షేత్రాధికారి గురుప్రసాద్ తన స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన 20 మంది సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
ఈ విషయం పై అటవీ క్షేత్రాధికారి గురుప్రసాద్ మాట్లాడుతూ, కార్చిచ్చు జరిగినది నిజమేనని తెలిపారు. శాటిలైట్ సమాచారంతో వెంటనే సిబ్బందిని అలర్ట్ చేసి దాదాపు 8 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చామని, ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందని చెప్పారు. అయితే చిన్న నిప్పురవ్వ ఉన్నా ప్రస్తుతం వీస్తున్న గాలుల కారణంగా మంటలు మళ్లీ వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మనుషులు చేరలేని ప్రదేశాల్లో మంటలను ఎలా అదుపు చేయాలనే దాని పై ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలిస్తున్నామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు