
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో అక్రమ అడ్వర్ టైజ్మెంట్ బోర్డులకు చెక్ పెట్టడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు రెడీ చేశారు. దీనికి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలను జోడించి మెరుగులు దిద్దనున్నారు. ఈ పాలసీ గురించి ఈనెల 23వ తేదిన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
మూడు కార్పొరేషన్లలో కొత్త అడ్వర్టైజ్ మెంట్ పాలసీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే సీఎం వద్ద జరిగిన రివ్యూలోనూ ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగులు, యునిపోల్స్పై జీహెచ్ఎంసీ వ్యాపార ప్రకటనలు కొనసాగేవి. గతంలో గాలికి హోర్డింగ్స్ పడి ప్రమాదాలు జరగడంతో హోర్డింగ్స్, యునిపోల్స్పై జీహెచ్ఎంసీ 2020లో నిషేధం విధించింది. దీంతో తాము నష్టపోతున్నామని, హోర్డింగ్స్పై కోట్లాది రూపాయలు పెట్టామని కోర్టుని ఆశ్రయించారు. ఆ తరువాత కొత్త పాలసీపై ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపాదలు రెడీ అయినప్పటికీ పాలసీ మాత్రం తీసుకురాలేదు. ఇప్పుడు కొత్త పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలోనూ ఈ పాలసీపై చర్చించే అవకాశం ఉంది.
అడ్వర్టైజ్మెంట్ విభాగంలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్(పీపీపీ) పద్ధతి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కొన్నింటిని పీపీపీ విధానంలో ఏర్పాటు చేసి పరిమిత కాలం వీటిని ఏర్పాటు చేసిన సంస్థలకు అప్పగించి ఆ తర్వాత జీహెచ్ఎంసీ సొంతం చేసుకునే మార్గదర్శకాలను తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
యునిపోల్స్, హోర్డింగ్ ఏర్పాటులో ఆర్థిక భారం లేకుండా ఏర్పాటు చేసి వీటితో వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్కు సమీపంలోనున్న ఫ్లై ఓవర్లు, ప్రైవేటు భవనాలు, ప్లై ఓవర్లపై వీటిని ఏర్పాటు చేసే అవకాశముంది. ఒక్కసారి ఏర్పాటు చేసి వదిలేయకుండా వీటి నిర్వహణపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్లతో వచ్చే ఆదాయం ఏ మాత్రం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటి ఏర్పాటు, నిర్వహణతో పాటు కేటాయింపులనూ పారదర్శకంగా నిర్వహించేలా ఈ మార్గదర్శకాలు ఉండనున్నాయి. కొత్త పాలసీకి సంబంధించి పూర్తిగా ప్రతిపాదనలకు జీహెచ్ఎంసీ రూపొందించినప్పటికీ మూడు కార్పొరేషన్లలోనూ ఈ పాలసీ అమల్లోకి రానుంది.
ప్రభుత్వ ప్రకటనలకు 10శాతం..
మూడు మున్సిపల్ కార్పొరేన్ల పరిధిలో అడ్వర్టైజ్మెంట్లో 10శాతం ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడానికి వినియోగించేలా పాలసీలో పొందుపర్చనున్నారు. ఫ్లై ఓవర్లకు ఇతర పబ్లిక్ ప్లేస్లలో అడ్వర్టైజ్మెంట్లు హోర్డింగ్స్, యునిపోల్స్ను అందుబాటులోకి తెచ్చేలా కొత్త పాలసీని రూపొందించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ పాలసీలో హోర్డింగ్స్, యునిపోల్స్ను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, వీటి సంఖ్య ఎంత వరకు పరిమితం చేయాలని, వీటిలో సర్కారు ఆదేశాల మేరకు పది శాతం సర్కారు స్కీమ్ ల ప్రచారానికి కేటాయించి మిగిలిన వాటిని ఆన్ లైన్ యాక్షన్లో కేటాయించేలా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..