
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
ఉస్మానియా విశ్వవిద్యాలయం
వేదికగా ప్రారంభమైన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సర్ల సదస్సు రెండు రోజున వివాదానికి కేంద్రబిందువైంది. ఈ సమావేశాలకు ప్రతినిధులను మీడియా అనుమతించకపోవడం బాధాకరం.
కీలక చర్చలు.. రహస్య సమావేశాలా?
భవిష్యత్ విద్యావ్యవస్థను శాసించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఇలాంటి సాంకేతిక అంశాలపై అగ్రశ్రేణి విద్యావేత్తలు తీసుకునే నిర్ణయాలు విద్యార్థులకు, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జర్నలిస్ట్లు డిమాండ్ చేశారు.. అయితే, అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఈ సెషన్లకు మీడియాకు అనుమతి లేదని అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యా విధానంలో కీలక మార్పులను చర్చించే వేదికలపై జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరించడం ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తూతూమంత్రంగా సెషన్లు?
ఏఐ వంటి సంక్లిష్టమైన అంశంపై సరైన అవగాహన లేకుండా, కేవలం మొక్కుబడిగానే సెషన్లు నిర్వహిస్తున్నారని, అందుకే సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో మీడియాను దూరంగా ఉంచడం వల్ల, అసలు సమాచారం ప్రజలకు చేరకుండా పోతోందని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో పారదర్శకత కొరవడటంపై విద్యావేత్తలు సైతం స్పందించారు. విద్యా సంస్కరణల పేరిట జరుగుతున్న ఈ గోప్యత చర్చలు ఎవరి ప్రయోజనం కోసం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓయూ వైస్ ఛాన్స్లర్ ఎం.కుమార్ స్పందిస్తారా? లేకపోతే చేతులు ఎత్తేస్తారా? తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు