
ఢిల్లీ,19 ,ఫిబ్రవరి (హి.స.)దేశవ్యాప్తంగా 37 రాజ్యసభస్థానాలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీకానున్న రెండు రాజ్యసభస్థానాల్లో ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్నది. రెండు సీట్లు హైకమాండ్ వ్యక్తులకు వెళ్తాయా? లేక ఒక సీటును రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇస్తారా? అనేదానిపై ఆసక్తి నెలకొన్నది. ఒకవేళ రాష్ట్రానికి ఒక ఎంపీ పదవి ఇస్తే, ఆ సీటును సొంతం చేసుకునేందుకు ఆశావహులు లాబీయింగ్ మొదలుపెట్టారు. ఇటు సీఎం రేవంత్, అటు హైకమాండ్లోని కీలక నేతల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సింఘ్వీకి రెన్యువల్..!
వచ్చే నెలలో రిటైర్డ్ కానున్న అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి ఎంపీ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. కే. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాక తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉపఎన్నికలో సింఘ్వీ ఎన్నికయ్యారు. ఆయన కేవలం రెండేళ్లు మాత్రమే ఎంపీగా ఉండటంతో మరోసారి ఆయన్ను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సుదర్శన్ రెడ్డికి ఎంపీ సీటు
గతేడాది జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోటీ చేసింది. అందుకోసం రాజకీయాలతో సంబంధం లేని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణవాది అయిన నిజామాబాద్కు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఉండటంతో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. అందుకు పరిహారంగా సుదర్శన్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సుదర్శన్ రెడ్డి అందుకు సానుకూలంగా ఉంటే.. ఆయన పేరును ఖరారు చేయనున్నారు. లేకపోతే ఆ సీటును రాష్ట్రానికి చెందిన లీడర్లకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఢిల్లీలో కో-ఆర్డినేట్ చేసే ప్రయారిటీ.. వ్యక్తులకు
కాంగ్రెస్ అధిష్టానంతో వివిధ అంశాల్లో సీఎం రేవంత్ తరపున సమన్వయం చేయడంలో ప్రస్తుత ఎంపీలు విఫలమవుతున్నారని, ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకోసం సీఎంకు నమ్మకస్తులు, అటు అధిష్టానం దృష్టిలో సైతం గుర్తింపు ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే కో ఆర్డినేషన్ సమస్య ఉండదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఆ జాబితాలో పొలిటికల్ అడ్వయిజర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి, ప్రొటోకాల్ అడ్వయిజర్గా పనిచేస్తున్న హర్కర వేణుగోపాల్ పేర్లు ఉన్నట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి టీమ్లో ఒకరుగా ఉన్న వేణుగోపాలక్కు ఢిల్లీ నేతలతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు ఎంపీ సీటు ఇస్తే తమకు న్యాయం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
లాబీయింగ్ షురూ..
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ, రాజ్యసభసీటు ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ అధిష్టానం కండీషన్ పెట్టింది. అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రికమెండ్ చేయడం, కేబినెట్లోకి తీసుకోవడంతో మిగతా లీడర్లు అదృష్టం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ జాబితాలో మధుయాష్కీ, షబ్బీర్ అలీ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయకుండా.. సీఎం రేవంత్ సూచన మేరకు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనీల్ తనకు ఈసారి రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు