
మధుర (యు.పి,) 19 ఫిబ్రవరి (హి.స.)
కారు కాలువలోకి దూసుకెళ్లి నలుగురు
యువకులు దుర్మరణ పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధుర జిల్లా మహావన్ ప్రాంతానికి చెందిన రాహుల్ (23), అమిత్ (22), మోహిత్ (22) వారి మరో స్నేహితుడు కలిసి రాజస్థాన్లోని డీగ్లో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. మగోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగాలా దైవియా వద్ద ఒక మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో కారు ముందుగా ఒక సిమెంట్ ట్యాంకును ఢీకొట్టి, ఆపై సుమారు 6 మీటర్ల లోతు ఉన్న కాలువలోకి పల్టీ కొట్టింది.
కాగా, మృతిచెందిన వారిలో అమిత్, మోహిత్ లా చదువుతున్న విద్యార్థులు కాగా, రాహుల్ టైలరింగ్ వృత్తిలో ఉన్నాడు. నాలుగో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా 22 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు గలవారే కావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును కాలువ నుంచి బయటకు తీశారు. అయితే, కారు నీటిలో మునిగిపోవడంతో లోపల ఉన్న వారంతా ఊపిరాడక మరణించినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..