జిహెచ్ఎంసి పునర్విభజనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హై కోర్ట్ నోటీసులు
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.) జీహెచ్ఎంసీ పునర్విభజన (GHMC Reorganisation) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు


హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)

జీహెచ్ఎంసీ పునర్విభజన (GHMC Reorganisation) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం నోటీసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజిస్తూ జీవో నంబర్ 55 ను ప్రభుత్వం జారీ చేసింది. అయితే జనగణన -2027 కోసం జూరిన్డిక్షనల్ ఫ్రీజ్ అమలులో ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ పునర్విభజన చట్టవిరుద్ధం అని పేర్కొంటూ జీవో నంబర్ 55ను దరం గురువ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

జీవోను రద్దు చేయండి:

ఈ పిటిషన్ ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ రాజ్కుమార్ గుమ్మి వాదనలు వినిపిస్తూ జనగణన కార్యక్రమాల కోసం ఒకసారి జ్యూరిన్డిక్షన్ ఫ్రీజ్ ప్రకటించాక మున్సిపల్ సరిహద్దుల మార్పులు, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ అనుమతించబడవని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి చర్యలు ప్రారంభం నుంచే చెల్లవని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల చట్ట విరుద్ధంగా, అధికార పరిధి లేకుండా జారీ చేసిన జీవో 55 ను రద్దు చేయాలని కోర్టును కోరారు. పిటిషనర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన అనంతరం ఈ కేసును తదుపరి విచారణకు కోర్టు తీసుకోనుంది.

కాగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో పడుతూ వస్తున్న జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడ్డాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026, అక్టోబర్ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే జనగణన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2027 మార్చి 31 వరకు జిల్లా, డివిజన్, మండలం, గ్రామం ఇలా ఏ ఒక్క రెవెన్యూ సరిహద్దును మార్చడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏమైనా మార్చాలంటే 31 డిసెంబర్ 2025లోపే మార్చాలని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరిగే సమయంలో ఇలా సరిహద్దుల మార్పులపై నిషేధం విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడా ఎలాంటి సరిహద్దు మార్పులు చేపట్టవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 11 ఫిబ్రవరి 2026 లో జీహెచ్ఎంసీ సరిహద్దులను పునర్ విభజిస్తూ జీవో జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande