
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31తో ముగియనుండడడంతో.. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎస్ పదవీ కాలాన్నే పొడిగిస్తారా? లేక కొత్తవారిని ఎంపిక చేస్తారా? అనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. రామకృష్ణారావు గతేడాది ఆగస్టులో రిటైర్డ్ కాగా.. కేంద్రం ఆయన పదవీ కాలాన్ని ఏడు నెలల పాటు పొడిగించింది. మరోసారి ఆయన టెన్యూర్ ను పొడిగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే కేంద్రం నుంచి సానుకూలత రాకుంటే.. ఆ పదవిని దక్కించుకునేందుకు ఐఏఎస్ లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.
రామకృష్ణారావు పట్ల సీఎం పాజిటివ్
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం కంటే.. ప్రస్తుత సీఎస్ పదవీ కాలాన్ని మరికొంత కాలంపాటు పొడిగించడం మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది. రామకృష్ణారావు సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రభుత్వ విభాగాల మధ్య లోపించిన సమన్వయాన్ని సాధించేందుకు ఫోకస్ పెట్టారనే పేరు ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన ప్రతిపాదనలు, పెండింగ్ అంశాలు క్లియరెన్స్ విషయంలో వేగం పుంజుకుందనే టాక్ ఉంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలిసింది.
పోటీలో సీనియర్లు.. ఢిల్లీలో లాబీయింగ్..
మరోవైపు సీఎస్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడగించవద్దని ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.మరికొందరు ఆ పదవిని తమకు ఇవ్వాలని పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ప్రస్తుతం స్పెషల్ సీఎస్ లు జయేశ్ రంజన్, సభ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ రేసులో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఓ ఆఫీసర్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ లోని పలువురు నేతలను కలిసి సీఎస్ పదవి ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సెంట్రల్ సర్వీస్ లో ఉన్న సంజయ్ జాజు సైతం సీఎస్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు