
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)
రాష్ట్రంలో నిజమైన సాగు దారులకే అవసరమైన యూరియా పంపిణీ చేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ మొబైల్ ఎరువుల బుకింగ్ యాప్ (Urea App)ను ప్రవేశపెట్టింది. జాతీయ సమాచారం కేంద్రం(NIC) ఆధ్వర్యంలో ఒన్సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ రైతులకు సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ మొబైల్ ఎరువుల బుకింగ్ యాప్ను డెవలప్ చేసింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బ్లాక్ మార్కెటింగ్, యూరియ దొరకదనే భయంతో అధికంగా కొనడం, నిల్వ వంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టింది. పారదర్శకంగా, సులభంగా ఎరువులు అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఆధారిత యూరియా బుకింగ్ వ్యవస్థను వ్యవశాయశాఖ అమలు చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా పరిమితులు విధించడమే కాకుండా నిజమైన సాగుదారులకు శాస్త్రీయంగా ఎరువుల కేటాయింపును అందించడమే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తాంది. రైతులు తమ ప్రాంతంలో యూరియా నిల్వలను రియల్ టైమ్లో తెలుసుకుని అవసరమైన పరిమాణాన్ని మొబైల్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
పంట సాగు ఆధారంగానే
ఈ యాప్లో పట్టాదారు పాస్బుక్ వివరాలు, సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, వ్యవసాయ విశ్వవిద్యాలయ సూచనలు వంటి అంశాల ఆధారంగా అర్హతను నిర్ణయించి పంట దశలకు అనుగుణంగా ఎరువులను కేటాయిస్తున్నారు. విడతలవారీగా విడుదల చేసే విధానంతో ఎరువుల సమర్థవంతమైన వినియోగం, పోషక పదార్థాల సమతుల్యత, పంట ఆరోగ్యం మెరుగుదల సాధ్యమవుతోంది. ఒక రైతు ఎంత ఎరువు కొనుగోలు చేస్తున్నాడు, అది సిఫారసులకు అనుగుణంగా ఉందో లేదో ఈ యాప్ ద్వారా అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో యూరియా వాడకం గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి మొబైల్ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. జిల్లాల్లో పంటల విస్తీర్ణంకు అనుగుణంగా డీలర్ కేంద్రాల పరిధిని నిర్ణయించడం, కొన్ని ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు మండలాలను యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు. డీలర్ నెట్వర్క్, రవాణా సౌకర్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని స్థానిక అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికీ 14.29 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా 56.86 లక్షల సంచులు యూరియా బుక్ చేయగా 51.47 లక్షల బస్తాలు కొనుగోలు చేశారు. ఈ గణాంకాలు యాప్ వినియోగంపై రైతులో ఆసక్తి పెంచింది. ముందుగా రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభమైన ఈ యాప్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఫీల్డ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు కేంద్ర ఎరువుల శాఖ ప్రశంసించింది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలపై కూడా పరిశీలిస్తుంది. ప్రస్తుతం యాప్లో ఉన్న లోపాలను దశలవారీగా సరిచేస్తూ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నారు. ఈ యాప్ ద్వారా రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా యూరియా పొందవచ్చని, రాష్ట్రంలోని ప్రతి రైతు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..