
వరంగల్, 19 ఫిబ్రవరి (హి.స.)
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ రావడంతో వరంగల్ కార్పొరేషన్ పై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అన్ని డివిజన్లలో పార్టీని సైతం బలోపేతం చేస్తున్నారు. రెండు నెలల్లో సభ్యుల పదవీకాలం పూర్తికానుండడంతో ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఉన్న ప్రాతినిధ్యం దక్కించుకునేందుకు సిద్ధం అవుతుండగా పలు డివిజన్లపై బీజేపీ, వామపక్ష పార్టీనేతలు నజర్ పెట్టారు.
వరంగల్ కార్పొరేషన్ పాలకమండలి సభ్యుల పదవీకాలం మే 9వతేదీతో పూర్తవుతుంది. పాలకమండలి సభ్యుల పదవీకాలం పూర్తి కాగానే ఎన్నికలను నిర్వహించనున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. నాలుగు నియోజకవర్గాలు వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ ఈస్ట్, వెస్ట్ లో ఎక్కువ డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గంలో తక్కువ డివిజన్లు ఉన్నాయి. గత రెండు పర్యాయాలు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ సభ్యులు గెలిచారు. మేయర్ ఆ పార్టీ నేతలే గెలుచుకున్నారు. నగర కార్పొరేషన్ లోని ఈ డివిజన్ల పరిధిలో ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. పదవీకాలం పూర్తయ్యేలోపు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులన్నీ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీ లు గెలిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కార్పొరేషన్ పై దృష్టి పెట్టారు. అన్ని డివిజన్లు గెలిస్తే ఉమ్మడి జిల్లాలో తిరుగుండదని లక్ష్యంతో పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు పనులు చేస్తున్నారు. డివిజన్ల వారీగా పనులను చేపడుతున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో అందుబాటులో ఉండి పనులను చేపడుతున్నారు. అన్ని డివిజన్లు కలియ తిరుగుతూ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించడంతో పాటు పనులన్నీ పూర్తి చేస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తమ డివిజన్ల పరిధిలో పనులను చేస్తున్నారు. ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ లో మెజార్టీ సాధించేందుకు పావులు కదుపుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు