
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.)
పెనుగంచిప్రోలు రూరల్:గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవటంతో అన్నదాతలు పండించిన పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని, ధరలు పెరిగిన తర్వాత విక్రయించుకుంటారు. ఈ క్రమంలో గడిచిన కొన్నేళ్లల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో గోదాములు వెలిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే 17 గోదాములుండగా.. 80,900 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిల్లో మిర్చి, పసుపు, చింతపండు, బెల్లం, శనగలు, కందులు, పెసలు నిల్వ చేస్తున్నారు.
కోల్ట్ స్టోరేజీల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిల్వ చేసిన సరుకు నాణ్యత దెబ్బతింటోంది. వేసవి కాలంలో గోదాముల్లో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. కొన్ని గోదాముల్లో ఏసీలు సరిగా పని చేయకపోవటంతో పంట నాణ్యత దెబ్బతిని రైతులు విక్రయించుకునే సమయంలో లబోదిబోమంటున్నారు. గోదాముకు, అందులో ఉన్న పంటలకు యజమాని బీమా కల్పించాల్సి ఉన్నా కొందరు దాన్ని పట్టించుకోవడం లేదు. బీమాను సకాలంలో రెన్యువల్ చేయించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు రైతులకు నష్టపరిహారం దక్కటం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ