
అమరావతి, 20 ఫిబ్రవరి (హి.స.) హెరిటేజ్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడుకు స్పష్టం చేశారు. ఇందాపూర్ డైయిరీకి, హెరిటేజ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంటైనా, రోజైనా, పది రోజులైనా చర్చిద్దామని తెలిపారు. శాసన మండలిలో గురువారం కూడా వైసీపీ సభ్యులు హెరిటేజ్‌పై చర్చకు పట్టుబట్టారు. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారంతా చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నిన్న, మొన్న ప్రభుత్వం తరఫున స్పష్టమైన సమాధానం చెప్పామన్నారు.
ఆధారాలు చూపించకుండా చీజ్ ప్యాకెట్ చూపించి అదే నెయ్యి అని చెప్పారన్నారు. చీజ్‌కు, నెయ్యికి వ్యత్యాసం తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు కూడా ఇచ్చిందని, వీరికి ఏ మాత్రం సిగ్గు, విశ్వసనీయత ఉన్నా తమ సవాల్‌ను స్వీకరించాలని అన్నారు. మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని హెరిటేజ్ సంస్థ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు దోచే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోదని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ