ఏఐ సమిట్‌లో సీఎం చంద్రబాబు.. పలు సంస్థలతో కీలక ఒప్పందాలు
దిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
CM AP


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)దిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు జరిగాయి. క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. భారత్‌లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణ కార్యక్రమం ఉండనుంది. ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, ఐబీఎం రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దక్షిణ భారత్‌లో మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంలోని వివిధ సంస్థలకు సేవలందించడంతోపాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ప్లాట్ ఫామ్‌ను రూపొందించనున్నారు.

ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థ ముందుకొచ్చింది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ కుదిరింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఇది దృష్టి సారించనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వైజర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది ఏఐ-క్వాంటం లెర్నర్లు, 2027 నాటికి 6 లక్షల మందిని సిద్ధం చేసేలా వైజర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఎంఓయూ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, ప్రొఫెసర్ మితేష్ పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande