
ఢిల్లీ, 20 ఫిబ్రవరి (హి.స.)రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా వ్యవస్థల భద్రత, కృత్రిమ మేధ అభివృద్ధి కోసం అమెరికా సారథ్యంలో ప్రారంభమైన ప్యాక్స్ సిలికా కూటమిలో శుక్రవారం భారత్ అధికారికంగా చేరింది.15 రకాల లాంథనైడ్స్, స్కాండియమ్, యిట్రియమ్ ఖనిజాలను రేర్ ఎర్త్ ఖనిజాలని పిలుస్తారు. సెమీకండక్టర్, కృత్రిమ మేధ రంగాలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. అధిక ఖర్చుతో కూడుకున్న సంక్లిష్టమైన ప్రక్రియలతో వీటిని వెలికి తీస్తారు. ఈ ఖనిజాలపై చైనా అధిపత్యాన్ని సవాలు చేసేందుకు అమెరికా ప్యాక్స్ సిలికా కూటమిని ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో భారత్ ఈ కూటమిలో చేరింది.
ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి స్పందించారు. భారత ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రెండు రంగాలకు సంబంధించి పూర్తిస్థాయి వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. ఈ దిశగా ప్యాక్స్ సిలికా కూటమి ఉపకరిస్తుందని చెప్పారు. ఇది యువతకు ఎంతో లాభిస్తుందని అన్నారు.
ఇది భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు. ఈ కూటమిలో భారత్ చేరిక ఒక వ్యూహాత్మక అవసరమని కూడా పేర్కొన్నారు. ఖనిజాల ప్రాసెసింగ్ రంగంలో భారత్ మంచి పురోగతి సాధిస్తోందని, ఇక్కడి ఇంజనీరింగ్ నిపుణుల ప్రతిభ అద్భుతమని కొనియాడారు. టెక్నాలజీ రంగంలో భారత్-అమెరికాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అన్నారు. అమెరికాతో పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ప్యాక్స్ సిలికా కూటమిలో చేరడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రేర్ ఎర్త్ ఖనిజాల నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వీటి వెలికితీత కార్యకలాపాల్లో 90 శాతం చైనాలో జరుగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్