
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. శుక్రవారం కోర్టు సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లకు కోర్టు సిబ్బంది సమాచారం అందించారు. వారంతా కోర్టు వద్దకు చేరుకుని.. ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షిదారులను ఆగమేఘాల మీద బయటకు పంపారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో బాంబు, డాగ్ స్వ్కాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. కోర్టులో బాంబు అమర్చామని.. దీనికి టైమ్ సైతం సెట్ చేశామని.. అది పేలబోతుందంటూ దుండగులు ఈ మెయిల్ ద్వారా సిబ్బందిని బెదిరించారు. దాంతో పోలీసులు కోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
మరో వైపు ఫిబ్రవరి 18వ తేదీ తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి బాంబు ఆచూకీ లభ్యం కాలేదు. ఇవి నకిలీ బెదిరింపులుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయినే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతలోనే కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్ రావడంపై కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్