
డిల్లీ, 20 ఫిబ్రవరి (హి.స.)పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నిందల పర్వం కొనసాగుతోందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది దురదృష్టకర పరిణామమని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా అసాధారణ నిర్ణయం తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court).. ఈ ప్రక్రియలో సాయం చేసేందుకు జ్యుడిషియల్ అధికారులను నియమించాలని హైకోర్టుకు ఆదేశించింది. ఎస్‌ఐఆర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఈ అధికారులు పరిశీలిస్తారని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ పరిశీలనకు గ్రేడ్ ఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరును ప్రస్తావిస్తూ.. ‘‘రెండు రాజ్యాంగబద్ధ విభాగాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతుండటం దురదృష్టకర పరిణామం. ఇది వ్యవస్థల మధ్య అపనమ్మకాన్ని రుజువు చేస్తోంది. అభ్యంతరాల స్వీకరణ దశలో ఈ ప్రక్రియ ఆగిపోయింది’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ‘సర్’ ప్రక్రియ కోసం జ్యుడిషియల్ అధికారులతోపాటు మాజీ న్యాయమూర్తుల సాయం తీసుకోవాలని, సంబంధిత అధికారులను నియమించుకోవాలంటూ కలకత్తా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు