
సిద్దిపేట, 20 ఫిబ్రవరి (హి.స.)
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయింది. ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ, 100 రోజులు కాదు కదా.. 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలవుతున్న దాఖలాలు లేవని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్లో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత మరియు చేనేత కార్మికులందరికీ తక్షణమే రూ. 4,000 పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని డిమాండ్ చేశారు. ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18% రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మోసం చేశారు. చదువుకునే పిల్లలకు టెన్త్ పాస్ అయితే రూ. 10,000, ఇంటర్ పాస్ అయితే రూ. 25,000, డిగ్రీకి రూ. 50,000, పీజీ చదివితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి.. ఈరోజు వరకు ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
కనీసం కేసీఆర్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు కూడా రావడం లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు సిద్దరామయ్య ని తీసుకొచ్చి, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ. 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపిందన్నారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. ఏటా రూ. 15,000 రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అవ్వాతాతలకు రూ. 4,000 ఇస్తామని హామీ ఇచ్చి 27 నెలలు గడుస్తున్నా 4000 పెన్షన్ అమలు కావడం లేదన్నారు. మహిళలకు రూ.2500 అమలు చేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు