
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)
రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికల
షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో పార్టీ ఇద్దరు అభ్యర్థులు.. రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. తాజాగా అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల ఎంపికపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మార్చి 1వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకోవటం సులభంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మంత్రులపై కావాలనే బీజేపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని అడిగినా కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్లు స్వతంత్రంగా పనిచేస్తారు.. బండి సంజయ్ చెప్పినట్లు కాదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ మంత్రులు అవినీతి చేస్తున్నారని బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా బండి సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..