రాత్రిపూటా ‘పోస్టల్‌’ సేవలు
పోస్టల్‌ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది.
Post office


హైదరాబాద్, 20 ఫిబ్రవరి (హి.స.)పోస్టల్‌ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. గతానికి భిన్నంగా రాత్రి పూట కూడా పనిచేస్తూ ‘సదా మీ సేవలో’ అంటున్నారు పోస్టల్‌ సిబ్బంది. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు అత్యవసరంగా పంపించే స్పీడ్‌ పోస్టులను మరింత త్వరగా చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేటి ఆధునిక యుగంలో దూసుకుపోతున్న ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ డెలివరీ వ్యవస్థలతో పోటీపడుతూ ప్రజల ముంగిట నిలుస్తోంది.

పోస్టల్‌శాఖలో అంతర్భాగమైన రిజిస్టర్‌ సేవలను ఐదు నెలల క్రితం నిలిపివేసి వాటిని స్పీడ్‌పోస్ట్‌ సేవల్లో విలీనం చేశారు. గతంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలకే పరిమితమైన ఈ సేవలను రాత్రంతా కూడా నిర్వహించేందుకు భారతీయ తపాలశాఖ ప్రయోగాత్మకంగా నైట్‌ సర్వీస్‌ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు స్పీడ్‌పోస్టు సేవలను నిర్వహిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ 15న ఆబిడ్స్‌ జనరల్‌ పోస్టాఫీ్‌సలో ప్రారంభమైన సేవలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పార్సిల్‌ను బుకింగ్‌ చేసుకుంటున్న వినియోగదారుల కోసం ఆన్‌లైన్‌లో ట్రాకింగ్‌ను అందుబాటులో ఉంచారు.

ప్రస్తుతం ఆబిడ్స్‌ జీపీఓలో రాత్రి 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఒక ఉద్యోగి స్పీడ్‌ పోస్టుల కోసం వచ్చే వారికి సేవలందిస్తున్నారు. అయితే బుకింగ్‌ కోసం ఇచ్చే ఫీజును కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే తీసుకుంటున్నారు. నగదు చెల్లింపులను నిరాకరిస్తున్నారు. అలాగే పోస్టాఫీసుకు ఎంతమంది వస్తున్నారు, సేవల పనితీరును సీసీ టీవీల ద్వారా అధికారులు పర్య వేక్షిస్తున్నారు. రాత్రిపూట బుకింగ్‌ చేసే డెలివరీలను 48 గంటల్లోగా చేరవేసే విధంగా చూస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande