
ఖమ్మం, 20 ఫిబ్రవరి (హి.స.)
ప్రస్తుతం 60 డివిజన్లుగా ఉన్న ఖమ్మం కార్పొరేషన్లో డివిజన్ల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పెరిగిన ఓటర్ల దృష్ట్యా డివిజన్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య రాష్ట్ర మున్సిపల్శాఖ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఐదు నుంచి 8డివిజన్లు పెరుగుతాయని అంచనాలు వేశారు. గతంలో ప్రతి డివిజను 5వేల మంది ఓటర్లు ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే కొత్త ఓటర్ల నమోదుతో ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్లో విలీనమైన గ్రామపంచాయతీలో ఓటర్లు పెరిగారు. వైఎస్ఆర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం, అలాగే టేకులపల్లిలో కేసీఆర్ టవర్స్లో ఏకంగా 1200 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడంతో ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటర్లు పెరిగిన డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఏకంగా 8వేల నుంచి 10వేలకు పెరిగింది. అక్కడ డివిజన్లను విభజించుతారని అనుకున్నారు. అలాగే అల్లిపురం, నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో విభజన జరిగి డివిజన్లు పెరుగుతాయని భావించారు. డివిజన్ల పెంపునకు అనుమతి రాకపోవడంతో ఈ విషయం వాయిదా పడినట్లు సమాచారం. దీంతో కార్పొరేటర్గా పోటీ చేద్దామని అనుకున్న నిరాశ చెందారు.
రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గం ముగిసే కార్పొరేషన్లకు ఏప్రిల్లోనే ఎన్నికల నిర్వహించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం గడువు మే10వ తేదీ వరకు ఉన్నప్పటికీ ఏప్రిల్లోనే ఎన్నికల నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నది. డివిజన్ల పెంపు లేకపోవడంతో గతంలో టికెట్లు ఆశించి భంగపడినవారు తమ ప్రాంతాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారికి ఆయా పార్టీలు తిరిగి టికెట్ ఇస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలువురు కార్పొరేటర్ల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మరి కొంతమంది చేరే అవకాశం ఉంది. దీంతో కార్పొరేటర్ల స్థానాలకు కాంగ్రెస్ తరఫున పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు